కొత్తగూడెం అర్బన్, జూన్ 30 : తమ కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత తల్లిదండ్రులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్‌నగర్ కు చెందిన హరి, ప్రశాంతి దంపతుల కుమారుడు సోమశేఖర్ (15) గడిచిన మే నెలలో ముర్రేడు వాగులో తమ బంధువుల పిల్లలతో కలిసి ఈతకు వెళ్లాడు. కాగా అదే వాగులో పలువురు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్ల కారణంగా షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈత రాక బాలుడు మృతిచెందినట్లు వెల్లడించారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
తమ కొడుకుకు ఈత వచ్చని తెలిపారు. తన కుమారుడికి ఈత వచ్చినప్పటికీ, ఈత రాక నీళ్లు మింగి చనిపోయాడని పోలీసులు ధ్రువీకరించి తమకు అన్యాయం చేశారని వాపోయారు. వాగులో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన విద్యుత్ మోటార్ల షార్ట్ సర్క్యూట్ వల్లే తమ కుమారుడు చనిపోయాడని తెలిపారు. అక్రమంగా ఎవరైతే వాగులో విద్యుత్ మోటార్లు అమర్చారో వారిపై కేసు నమోదు చేయకుండా వదిలేశారని, కేసు రీ ఎంక్వయిరీ జరిపి తమ కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన లక్ష్మీదేవిపల్లి పోలీసులపై శాఖ పరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన వారిలో మహిళా సంఘం నాయకురాలు రెంటపల్లి మాధవీలత ఉన్నారు.