– వంటా వార్పు నిరసనలో ఎంపీ వద్దిరాజు. మాజీ మంత్రి వనమా
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 04 : పట్టా భూములపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం తొలగించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్‌లో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రజల సొమ్ములను దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఇచ్చిన 420 హామీలు ఒకటి కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. పాలన చేతకాక నిత్యం ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్లి మాటలు చెప్పి కాలక్షేపం చేస్తున్నారన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని, ఇప్పుడు చేసేదేమీ లేక బూతు పురాణం మొదలుపెట్టారన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే నేడు ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొత్త పథకాలు అమలు చేస్తామంటూ ఇంతవరకు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కొత్త పింఛన్ ఇవ్వలేదన్నారు.
రైతు కుటుంబాలు వీధిన పడితే రైతు బీమా చెల్లించలేక రైతులను మోసం చేశారన్నారు. ప్రతినిత్యం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కారం చేయడం లేదన్నారు.. రైతులకు కావాల్సిన యూరియా కూడా ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్రంలో పట్టా భూములను కూడా నిషేదిత జాబితాలో పెట్టి అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. నిషిద్ధత భూములపై నిషేధం ఎత్తేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. తమ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి శూన్యం అన్నారు. గత ప్రభుత్వం నిర్మాణం చేసిన సీతారామ ప్రాజెక్టుని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి కనీసం జిల్లాకి సాగునీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎంపీ వద్దిరాజు కొత్తగూడెం ప్రజలకు అండగా ఉంటారన్నారు. ఆయనకి నిరంతరం మద్దతు ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, కిలారీ నాగేశ్వరావు, కార్పొరేటర్లు సింధు తపస్వీ, గుణ చరిత, రాంబాబు, మధు చంద్, సాగర్, శ్రీవల్లి, వీరమ్మ, కొట్టి వెంకటేశ్వర్లు, భీమా శ్రీధర్, మంతపురి రాజ్ గౌడ్, మల్లెల రవిచంద్, బాధవత్ శాంతి, అనుదీప్, రాజేష్, లావుడ్యా సంపూ పాల్గొన్నారు.

‘పట్టా భూములుపై నిషేధం తొలగించే వరకు పోరాటం’