రామవరం, మే 02 : సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. మానవులంతా పరస్పరం సోదరులని, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించేలా చూడాలని జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖలీద్ ముబాషిర్ అన్నారు. శుక్రవారం రామవరం పోస్టాపీస్ సెంటర్లోని మదుర బస్తీలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వమానవ సౌభ్రాతృత్వం సమానత్వం కోసం కులమతాలకు అతీతంగా, ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమన్యాయం అందేలా కార్యకర్తలు న్యాయ ధ్వజ వాహకులుగా నిలవాలి ఆయన కోరారు. సమాజం ఒక శరీరం లాంటిది. ఇందులో ఏ ఒక్కరికీ కష్టం నష్టం కలిగినా సమాజం అంతటికి నష్టం, కష్టం కలుగుతుందన్నారు. సమాజంలో న్యాయం, ధర్మం, సమాన హక్కుల కోసం నిరంతరం పొరాడాలన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోహేబ్ మాట్లాడుతూ.. జమాతే ఇస్లామి హింద్ ఒక స్వచ్ఛంద ధార్మిక సేవా సంస్థ అని తెలిపారు. గత 75 సంవత్సరాల నుండి కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా సమాజ సేవ చేస్తూ అందరూ కలిసి మెలిసి జీవించేలా శాంతి స్థాపనకు కృషి చేస్తుందన్నారు. కార్యకర్తలు అనుక్షణం సమాజ హితం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నయీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ యజ్దానీ, షరీఫ్, పట్టణ అధ్యక్షుడు జహంగీర్, అబ్దుల్ బాసిత్, షబ్బీర్ హుస్సేన్, ముజాహిద్, జిల్లా అధ్యక్షురాలు పర్వీన్ సుల్తానా, షేహనాజ్, ఏజాజ్, నష్రా పాల్గొన్నారు.