– బూర్గంపహాడ్ మండల పాఠశాలల స్థాయి క్రీడల ప్రారంభోత్సవంలో ఎంపీడీవో, ఎంఈవో
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10 : మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల పాఠశాలల స్థాయి క్రీడలను ఆయన ఎంఈవో యదుసింహరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బొర్రా సుభద్ర, ఉప సర్పంచ్ పొక్కుల రవి హాజరయ్యారు. అండర్-17, అండర్-14 విభాగాల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, 100, 200 మీటర్ల రన్నింగ్, లాంగ్, హైజంప్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 10, 11 తేదీల్లో జరిగే ఈ క్రీడా పోటీల్లో విద్యార్థులతో పాటు అధికారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. బాలికలకు శుక్రవారం క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ క్రీడా పోటీల్లో డోనర్ రైస్ మిల్లు నిర్వాహకులు రామచంద్రారెడ్డి, ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి, పీడీలు కృష్ణ, బాబూరావు, పూర్ణ, జనార్ధన్, సుకన్య, నాగలక్ష్మి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని ఇరవెండి యూపీఎస్ పాఠశాలను ఎంఈవో యదుసింహరాజు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను కలియతిరిగి స్కూల్ గార్డెన్‌ను చూసి నాటిన ఔషధ మొక్కలను పరిశీలించారు. రణపాల, తులసి, అల్లోవీరా మొక్కలు పెంచడం పట్ల పాఠశాల హెచ్ఎం సత్యనారాయణను అభినందించారు. అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయురాలు తులసి బోధిస్తున్న తీరును గమనించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ జగన్ పాల్గొన్నారు.