– ఎమ్మెల్యే కూనంనేనికి 104 సిబ్బంది వినతి
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 29 : వైద్య ఆరోగ్య శాఖ 104 సర్వీసులో పని చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వారు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా 104 సర్వీస్ లో పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లకు గత ఆరు నెలలుగా జీతాలు విడుదల చేయకపోవడంతో ఆర్ధికపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు తమ ఆవేదనను విన్నవించారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో గత 17 సంవత్సరాలుగా పని చేస్తున్న డ్రైవర్లను, డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు పంపుతూ డీఎంఈ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేశారని, తద్వారా తమకు వచ్చే చాలీచాలని జీతంతో దూర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించాలంటే ఇబ్బందులు పడుతామని తమపైనే ఆధారపడి తల్లిదండ్రులు, కుటుంబం ఉందని ఎమ్మెల్యేకు తమ గోడును వెలిబుచ్చారు.
తమను తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కానీ, ఖాళీగా ఉన్న డీఎం అండ్ హెచ్ కార్యాలయానికి అనుసంధానం చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ అంశంపై డీఎంఈతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎండీ.అక్రం, ఎ.రమాదేవి, ఎం.ఉపేందర్, ఎ.శారద, జి.శ్రీనివాస్, ఎం.మధు, జి.నాగేశ్వరరావు, బి.రమేష్, ఎండీ. ఫరీద్ బెగ్, పి.కోటేశ్వరరావు, జి.రమేశ్, వి.రవి, బి.శ్రీకాంత్, టి.కిరణ్ కుమార్, పి.రాఘవులు, శరత్, సంతోష్, వెంకటేశ్వరరావు, వై.శాంతలత ఉన్నారు.