– ఏఐటీయూసీ పోరాటానికి కీలక విజయం
– 23 డిమాండ్లపై యాజమాన్యం అంగీకారం
రుద్రంపూర్, ఆగస్టు 28 : సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటం కీలక విజయాన్ని సాధించింది. ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు ప్రభావంతో సింగరేణి యాజమాన్యం దిగివచ్చి కార్మికుల పలు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించింది. జూన్ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్ఎల్సీ సమక్షంలో పలుమార్లు జరిగిన చర్చల అనంతరం గురువారం జరిగిన కీలక చర్చల్లో యాజమాన్యం పలు అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంది. అనంతరం కేంద్ర కార్మిక ప్రాంతీయ కమిషనర్ కార్యాలయంలో ఏఎల్సీ శాశ్వతిరెడ్డి సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు.
పెర్క్స్‌పై ఆదాయపు పన్ను : కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్‌పై విధించే ఇన్కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే భరించేందుకు అంగీకరించింది.
సహజ మరణానికి రూ.20 లక్షలు : సర్వీసులో ఉండగానే సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షలు అందించే అంశానికి యాజమాన్యం అంగీకరించింది.
ప్రతి నెల మెడికల్ బోర్డు : కార్మికుల వైద్య సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలనెలా మెడికల్ బోర్డు నిర్వహించనున్నారు.
వాస్తవ లాభాల ప్రకటన : 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు తీసుకుని చర్యలు చేపట్టనున్నారు.
ట్రాన్స్ఫర్ నిబంధనలో మార్పు : మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధనను తొలగించి, ఖాళీల ఆధారంగా ఒక సంవత్సరం నిబంధనతో ట్రాన్స్ఫర్లు చేపట్టేందుకు అంగీకరించారు.
ఓవర్‌మ్యాన్ ప్రమోషన్లు : అర్హులైన సీనియర్ మైనింగ్ స్టాఫ్‌కు సకాలంలో ఓవర్‌మ్యాన్ ప్రమోషన్లు కల్పించనున్నారు.
మారుపేర్ల సమస్యకు కమిటీ : ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు కమిటీ ఏర్పాటు చేసి, అందులో యూనియన్ సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు.
హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి : సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.
మెడికల్ అటెండెన్స్ నిబంధనల సవరణ : దాదాపు 22 ఏళ్లుగా మార్పులేని మెడికల్ అటెండెన్స్ నిబంధనలను సవరించేందుకు అంగీకరించారు.
దిగిపోయిన కార్మికులకు చికిత్స : సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీ సేవలతో పాటు వారం రోజుల వరకు చికిత్స అందించేలా చర్యలు చేపట్టనున్నారు.
విద్యాసంస్థల్లో సీబీఎస్ఈ : సింగరేణి విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో CBSE సిలబస్ అమలుపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.
భద్రతా సామగ్రి : గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన సేఫ్టీ మెటీరియల్‌ను సకాలంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.
9 శాతం హెచ్ఆర్ఏ : మందమరి–క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 9 శాతం HRA కల్పించేందుకు అంగీకరించారు.
డిస్మిస్ కార్మికుల కేసులు : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డిస్మిస్ కేసులను HPC కమిటీ ద్వారా పరిష్కరించేందుకు అంగీకరించారు.
మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ ఉద్యోగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, అండర్‌గ్రౌండ్ మైనింగ్ విభాగాల్లో జనరల్ అసిస్టెంట్లుగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిశీలించి అర్హతలకు అనుగుణంగా సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ESI వైద్య సదుపాయం అందేలా చర్యలు చేపట్టనున్నారు.
డిపెండెంట్ ఉద్యోగాలు : పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అంగీకరించారు.
ఈవెనింగ్ కాలేజీలకు ఎన్ఓసీ : ఉద్యోగులు సాంకేతిక విద్యను కొనసాగించేందుకు ఈవెనింగ్ కాలేజీల్లో చదువుకోవడానికి అవసరమైన NOCలు జారీ చేయనున్నారు.
ఖాళీ పోస్టుల భర్తీ : క్లారికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పారామెడికల్, S&PC సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రికల్, మెకానికల్ సూపర్వైజర్లు తదితర ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.
క్యాడర్ స్కీమ్ సమస్యలు : EP ఫిట్టర్లు, SDL ఆపరేటర్లు, సర్వేయర్లు తదితర క్యాడర్ స్కీమ్ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అంగీకరించారు.
149 మంది డిపెండెంట్లకు ఆఫీస్ ఆర్డర్లు : మెడికల్ ఫిట్ అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు నెల రోజుల్లోపు ఆఫీస్ ఆర్డర్లు జారీ చేయనున్నారు.
సొంత ఇంటి పథకం : కార్మికులకు సొంత ఇంటి పథకం అమలుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న విధానాన్ని పరిశీలించనున్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు సమ్మె విషయంలో నిబంధనలు : చట్టబద్ధంగా జరిగే సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటే ‘నో వర్క్–నో పే’ అమలు చేస్తారు. వారికి ఫైన్లు విధించరాదనే అంశంపై అంగీకారం కుదిరింది.
ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన చర్చలు, యాజమాన్యంపై కొనసాగించిన నిరంతర ఒత్తిడి ఫలితంగానే ఈ కీలక నిర్ణయాలు సాధ్యమయ్యాయని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్, సహజ మరణానికి రూ.20 లక్షలు, మెడికల్ బోర్డు, లాభాల ప్రకటన, ట్రాన్స్ఫర్ నిబంధనల మార్పు, ప్రమోషన్లు, వైద్య సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ ఉద్యోగాలు తదితర అంశాలపై సాధించిన అంగీకారాలు సింగరేణి కార్మికుల పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఈ చర్చల్లో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు సారయ్య, వై.వి.రావు, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, ముస్కే సమ్మయ్య.. యాజమాన్యం తరఫున డైరెక్టర్ పా.గౌతం పోట్రూ, జీఎం పర్సనల్ కిరణ్‌కుమార్, అజయ్, జీఎం ఎం.ఎస్.రవి, డీజీఎం రాజగోపాల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.