రామవరం, నవంబర్ 17 : ఇటీవల కాలంలో సింగరేణిలో ఆర్భాటాల పేరుమీద లక్షలు ఖర్చుపెడుతున్నారు. అదే కార్మిక సంక్షేమానికి వచ్చేసరికి కొర్రీలు పెడుతున్నారంటూ కార్మికులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో సర్ఫేస్ (ఉపరితల) విభాగాల్లో కార్మికులు విధులు నిర్వహించే సమయంలో నానా అవస్థలు పడుతున్నారు. గతంలో సీఎస్పీలలో విధులు నిర్వహించే కన్వేయర్ ఆపరేటర్, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, హెల్పర్లకు, వ్యాగిన్ షంటింగ్ మజ్దాుర్, లారీ మానిటరింగ్ సిబ్బందికి, మ్యాగ్జిన్ మజ్దాూర్లకు, పంప్ ఆపరేటర్లకు, కేజీ ఆపరేటర్లకు చలి నుండి కాపాడుకునేందుకు యాజమాన్యం చలికోట్లు అందజేసేది. కానీ ఇటీవల కాలంలో వాటి ఊసెత్తిన వారే లేరు. సీజన్ మొదలైనప్పటికీ దానిమీద కార్యచరణ చేసిన దాఖలాలు లేవు.
మంత్రుల ప్రసన్నత కోసం తపిస్తున్నారే తప్పా యాజమాన్యం కార్మికుల సంక్షేమం మరిచిందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని సంస్కృతిని సింగరేణిలో ఈ మధ్య కాలంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా దానికి మంత్రులను, ఎమ్మెల్యేలను పిలిచి సంస్థ నిధులను దుర్వినియోగం పర్చడంలో ఉన్నశ్రద్ద కార్మికుల సంక్షేమానికి సంబందించిన విషయానికి వచ్చేసరికి కొర్రీలు పెడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ఈ విషయమై ఆర్ సి హెచ్ పి ఎస్.ఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా తాము తమ దగ్గర పనిచేస్తున్న 50 మందికి వామ్ కోట్స్ కావాలని పంపించామని, ఇప్పటివరకు రాలేదని తెలిపారు.