Ramavaram | రామవరం, జూన్ 1: మొక్కలు నాటడం అంటే దేవుడికి సేవ చేసినట్లేనని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆదివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేవోసీ యార్డ్‌పై వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎండీకి ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు మొక్కను నాటి సంరక్షించాలన్నారు. మొక్క పెరిగి పెద్దదై కోట్ల విలువైచేసే ఆక్సిజన్ ఇస్తుందని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుందన్నారు. ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో ప్రకృతి వినాశనం వల్ల భుకంపాలు, తుఫానులు, అకాల వర్షాలతో జరిగే జరిగే బీభత్సాన్ని చూస్తున్నామన్నారు.
వాటి నుంచి మన భవిష్యత్ తరాల కోసం మొక్కలను నాటాల్సిన అవసరం ఉందన్నారు. గాలికి సరిహద్దు ఉండదని, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలాగైతే ప్రణాళికలు వేసుకుంటామో.. భవిష్యత్ తరాల కోసం అందించేందుకు మొక్కను నాటాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతీ ఆఫీస్, డిపార్ట్మెంట్లలో ఖాళీ ప్రదేశాల్లో ప్రతీ అడుగు పచ్చదనం కోసమేనని.. అదే నినాదంతో మొక్కలను నాటాలని అధికారులను కోరారు. ఇప్పటికే 19వేల మొక్కలను నాటానని, ఈ ఏగాది 2వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుంటున్నానన్నారు. అందులో భాగంగా జీకేఓసీ 200 మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్మిక ప్రాంతాల్లో ఉండే క్వార్టర్లలో పండ్ల మొక్కలను పెంచే విధంగా వారిని ప్రోత్సహించాలని, కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మున్సిపాలిటీలు, పంచాయతీలు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా మొక్కలు అడిగితే వారికి అందుబాటులో పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు అందించే విదంగా ఏర్పాటు చేసుకోవాలని, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జీఎం మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన 85 హెక్టార్లలో 3.5లక్షల మొక్కలు నాటాడానికి ప్రణాళికలు చేస్తున్నామని, దానిలో భాగంగా ఓసీలో హెక్టార్లో దాదాపు 500 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం చైర్మన్ నూతనంగా ప్రారంభించిన జల సింధువు- నీటి బింధువు కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఏరియాకు ఎనిమిది కుంట చెరువులను తీయాలని నిర్దేశించారు. నిర్మాణ పనులు అన్ని పూర్తయ్యాయని జీఎం తెలుపగా.. జీకే ఓసీలో నిర్మించిన కుంట చెరువుని సీఎండీ సందర్శించారు.
కార్యక్రమంలో సీఎండీతో పాటు డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఆన్ ప్లానింగ్ అండ్ పా కొప్పుల వెంకటేశ్వర్లు , ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ మోహన్ చంద్ర పర్జిన్, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం షాలెం రాజు, జీఎం ఎన్విరాన్మెంట్ బీ సైదులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ జీకే ఓసీ ఎం శ్రీ రమేశ్, ఏరియా ఇంజినీర్ కే సూర్యనారాయణ రాజు, కొత్తగూడెం ఏరియా అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి జే గట్టయ్య, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, కొత్తగూడం ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు ఎంవీ నరసింహారావు, ఎస్ఓ టు జీఎం జీవి కోటి రెడ్డి, ఏజిఎం (సివిల్) సీహెచ్ రామకృష్ణ, ఏజీఎం (ఫైనాన్స్) కే సుమలత, డీజీఎం (పర్సనల్) బీ శివ కేశవరావు, డీజీఎం (ఐఈడీ) ఎన్ యోహన్, ఎస్ఓఎం ఎన్విరాన్మెంట్ టీ సత్యనారాయణ, ఫారెస్ట్ మేనేజర్ హరినారాయణ, జీకేఓసీ మేనేజర్ రామచంద్ర మురళి, ఐటీ మేనేజర్ శేషశ్రీ తదితరులు పాల్గొన్నారు.