రామవరం, మే 20 : వారు విధుల్లో ఉన్నప్పుడు చెమట చుక్కలను చిందించారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర ఉన్నది. కానీ అనారోగ్య కారణాలతో వారు పని చేయలేక బోర్డు మెడికల్ అయ్యి వారి వారసులకు కారుణ్య నియామకాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా తమపై కారుణ్యం చూపడం లేదని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో గతంలో మెడికల్ అయ్యి కారుణ్య నియామకాల ద్వారా తమ వారసులకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్న 8 మంది దానికి కావాల్సిన పత్రాలను సమర్పించినప్పటికీ, ఆరు నెలల నుండి తిప్పిస్తున్నారని, కేవలం తాము పనిచేసిన ఏరియా వర్క్ షాప్ లోనే ఆరు నెలల కాలం తీసుకుంటే మిగతా కార్యాలయాలు ఇంకా ఎంత సమయం తీసుకుంటాయో అర్థం కావడం లేదని అంటున్నారు.
ఒకవైపు కారుణ్య నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సంస్థ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అవి తమకు వర్తించవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు క్రింది స్థాయి సిబ్బంది. ఎన్నిసార్లు సమీక్ష సమావేశలు పెట్టినా సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదని, ఇప్పటికైనా అధికారులు ఏ నెలలో ఎవరెవరు మెడికల్ ఇన్వాల్యుడేషన్ అయ్యారు? కారుణ్య నియామకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నారు? వారి దరఖాస్తుల స్థితిగతులపై నెలకు ఒకసారైనా రివ్యూ మీటింగ్ జరిపితే తప్ప సమస్యకు పరిష్కారం కనబడే పరిస్థితి లేదని, ఏరియాలో పర్సనల్ విభాగం పూర్తిగా వైఫల్యం చెందడమే దీని ప్రధాన కారణమని కార్మికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కారుణ్య నియామక ప్రక్రియలో ఆలస్యం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏరియా వర్క్ షాప్ డీవైజీఎం టి.శ్రీకాంత్‌ను వివరణ కోరగా క్లర్క్ ఒక్కరే ఉండడం వల్ల ఆలస్యం అవుతుందని, సాధ్యమైనంత తొందరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.