– టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో కాపు కృష్ణ
రుద్రంపూర్, జనవరి 27 : సింగరేణిలో జాతీయ సంఘాలను కాదని టీబీజీకేఎస్ ను కార్మికులు తమ గుండెలకు హత్తుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కొత్త హక్కులు తీసుకురావడంతో పాటు జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తీసుకురావడం జరిగిందని, దాని ద్వారా 17 వేల ఉద్యోగాలు కార్మికుల పిల్లలు చేస్తున్నారని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. మంగళవారం,కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో ఏరియాలోని గనులు, అన్ని డిపార్ట్మెంట్ల వద్ద, యూనియన్ కార్యాలయాల వద్ద, రామవరంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం, వీకే సి ఏం ఓపెన్ కాస్ట్, పీవీకే లలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి టీబీజీకేఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 జనవరి 27న టీబీజీకేఎస్ సంఘం ప్రొఫెసర్ జయశంకర్, కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా ప్రారంభించబడిందని తెలిపారు.
టీబీజీకేఎస్ కోరిక మేరకు కేసీఆర్ సింగరేణిలో కార్మికులకు ఎనలేని హక్కులు అందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఇంక్రిమెంటు, ఉచిత విద్యుత్, తల్లిదండ్రులకు కార్పొరేట్ ఉచిత వైద్యం లాంటి ఎన్నో సౌకర్యాలు అందించామన్నారు. గత రెండు సంవత్సరాలుగా సింగరేణిలో ఉన్న సంఘాలు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులను ఇబ్బంది పెడుతున్నాయని, గెలిచిన యూనియన్స్, ప్రభుత్వం సింగరేణిని సీఎం రేవంత్ రెడ్డి బావ మరిదికి దోచి పెడుతుంటే చోద్యం చూస్తున్నట్లు తెలిపారు. త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించి, మరోమారు సింగరేణి కార్మికుల హక్కుల సాధనతో పాటు ఆత్మ గౌరవాన్ని రక్షిస్తుందన్నారు. గులాబీ జెండాకు తెలంగాణ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ముఖ్యం అని, ఇది మన జెండా.. తెలంగాణ జెండా అని దీనిని అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోరింగ్ శంకర్, సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితపు విజయ్ కుమార్, అరుణ్, ఫిట్ సెక్రటరీలు రాజకుమార్, వెంకటేశ్వర్లు, సంతోష్, ఆంజనేయులు, రాజేష్, సుధాకర్, అణుదీప్, బాలాజీ, అశోక్, కోటేశ్వరరావు, ప్రకాష్ పాల్గొన్నారు.

Rudrampur : ‘కార్మికుల ఆత్మగౌరవమే టీబీజీకేఎస్ అజెండా’