– స్థానిక గిరిజనులకే వంద శాతం ఉద్యోగాలు కల్పించాలి
– ఎల్‌హెచ్‌పీఎస్ డిమాండ్
రుద్రంపూర్, మే 16 : కొత్తగూడెం సింగరేణి ఏరియాలో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల నియామకానికి సంబంధించి “లక్ష్మీ నరసింహ” సెక్యూరిటీ ఏజెన్సీకి కేటాయించిన టెండర్‌ను తక్షణమే రద్దు చేసి, ఏజెన్సీ ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగిన స్థానిక గిరిజనులకే టెండర్ కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఏం శాలెం రాజుకు వినతిపత్రం అందజేశారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, భూ బదలాయింపు నిషేధ చట్టాలు 1/59, 1/70, పీసా చట్టం-1996 అలాగే 1997 సమతా తీర్పు ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు స్థానిక గిరిజనులకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.
“లక్ష్మీ నరసింహ” సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు గిరిజనేతరుడు కావడంతో, ఆ సంస్థకు ఏజెన్సీ ప్రాంతంలో టెండర్ చెల్లదని తెలిపారు. ఐటీడీఏ భద్రాచలం పరిధిలో లైసెన్స్ పొందిన గిరిజనులకు మాత్రమే ఇలాంటి టెండర్లు కేటాయించాలని కోరారు. సింగరేణి కార్యకలాపాల వల్ల ప్రభావితమవుతున్న గిరిజన గ్రామాల పరిస్థితిని కూడా వారు వినతిపత్రంలో ప్రస్తావించారు. ఓపెన్‌కాస్ట్ గనుల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోవడం, చెరువులు ఎండిపోవడం, పంటలు నష్టపోవడం, పశువులకు నీరు–మేత కొరత ఏర్పడటం, వ్యవసాయ భూములు బీడు భూములుగా మారడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని పేర్కొన్నారు. అదేవిధంగా బ్లాస్టింగ్ల కారణంగా గ్రామాల్లో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని ఆరోపించారు.
కాబట్టి సింగరేణి ఏరియాకు 12 కిలోమీటర్ల పరిధిలోని ప్రభావిత గ్రామాల స్థానిక గిరిజనులకే సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో 100 శాతం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు గుగులోత్ కుశ నాయక్, లచ్చు నాయక్, పృథ్వి నాయక్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.