– ఉప సర్పంచ్ నిర్వాకంతో రెండు నెలలుగా వేతనాలు బకాయి
చుంచుపల్లి, మే 19 : చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం తొమ్మిది మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా ప్రతి నెల 10వ తేదీలోపు వారి ఖాతాల్లో జీతాలు జమయ్యేవి. అయితే గత రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకం చేసినప్పటికీ, ఉప సర్పంచ్ డిజిటల్ ఓటీపీ ప్రక్రియ పూర్తికాక పోవడంతో జీతాల చెల్లింపులు ఆగిపోయినట్లు సమాచారం. ఓ ఇంటికి కుళాయి కనెక్షన్ మంజూరు చేసిన విషయంపై ఉప సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంప్ ఆపరేటర్ జీతం నిలిపివేయాలని సూచించినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఈ కుళాయి వ్యవహారమే సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య విభేదాలకు దారితీసిందని, దాని ప్రభావం పారిశుధ్య కార్మికుల జీతాలపై పడిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంపై సర్పంచ్ శ్రీకాంత్ జిల్లా పంచాయతీ అధికారిణి విద్యాచందనకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉప సర్పంచ్ మాలోతి లక్ష్మి, ఆమె కుమారుడు సంపత్ కారణంగా పారిశుధ్య కార్మికుల జీతాలు, ఇతర బిల్లులు కూడా రెండు నెలలుగా నిలిచిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఫిర్యాదు నేపథ్యంలో డీఎల్పీఓ కీర్తి ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి వసంత, ఎంపీఓ సంధ్య మంగళవారం ఎన్కే నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని విచారణ నిర్వహించారు. అయితే ఉప సర్పంచ్ మాలోతి లక్ష్మి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్లాల్సి రావడంతో విచారణకు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిరాను పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని డీఎల్పీఓ కీర్తి ప్రభాకర్ ఆదేశించారు. నివేదికను పై అధికారులకు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, వెంటనే తమ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని పారిశుధ్య కార్మికులు అధికారులను కోరారు.