రామవరం, నవంబర్ 24 : కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా బీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మక నిర్ణయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలో ‘కార్మికుల బీమా పెంపు’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సహజ మరణ బీమాను రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు, ప్రమాద మరణ బీమాను రూ.6 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 16.50 లక్షల కార్మికులు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.
బీమా ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండేందుకు కార్మిక శాఖ, బీమా సంస్థలు, బోర్డులు సమన్వయంతో వేగంగా సేవలను అందించాలని అధికారులకు సూచించారు. బీమా క్లెయిమ్ విధానం, అవసరమైన పత్రాలు, అర్హతలు, టోల్ ఫ్రీ నంబర్లు వంటి సమాచారాన్ని గ్రామ స్థాయి వరకు విస్తృతంగా చేరేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కార్మిక కుటుంబాలు ఏ కష్టకాలంలోనైనా ఆర్థికంగా కూలిపోకుండా రక్షించేందుకు ఈ బీమా పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్ పాల్గొన్నారు.