రామవరం, ఏప్రిల్ 17 : వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం తెలిపారు. గతంలో ఆపద్బంధు పేరుతో రూ.50 వేలు చెల్లించేవారని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పట్టణ, స్థానిక సంస్థల ప్రజలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు వడదెబ్బతో మృతి చెందుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకుని పరిహారం పెంచినట్లు వెల్లడించారు. అధికారులు ఈ విషయమై మున్సిపాలిటీ, ఎంపీడీఓ, తాసీల్దార్ కార్యాలయాల్లో పథకంపై అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.