– కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ
రుద్రంపూర్, జూలై 18 : రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్లను ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ (రిజిస్ట్రేషన్ నెం.1630/1982) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సింగరేణి సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి మాట్లాడుతూ.. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై కమిషన్ ప్రత్యక్షంగా పర్యటించి యాజమాన్యంతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠకు అనుమతులు మంజూరు చేయాలని, సింగరేణి విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అంతర్గత వివక్షను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా కమిషన్ పర్యటించాలని కోరారు.
వినతిపై స్పందించిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై గతంలోనే యాజమాన్యానికి సూచనలు చేశామని తెలిపారు. త్వరలో సింగరేణి యాజమాన్యంతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష లేదా అన్యాయం జరిగితే వెంటనే కమిషన్ దృష్టికి తీసుకురావాలని, కమిషన్ ఆదేశాలను అమలు చేయని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆరెపల్లి రామచందర్, కొత్తగూడెం రీజనల్ సెక్రటరీ మధు కృష్ణ, కార్పొరేట్ ఏరియా ఇన్చార్జి వెంకటేష్, నాయకులు బాలునాయక్, మోహన్ చందు నాయక్తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.