– ఖండించిన బీఆర్ఎస్ నేతలు
బూర్గంపహాడ్, జూలై 13 : అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీతారామ ప్రాజెక్టు సాగునీటి సమస్యలపై వినతిపత్రం అందజేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చిన నేపధ్యంలో మణుగూరులోని నివాసంలో ఆయనను పోలీసులు నిర్భందించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సారపాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వినతిపత్రం సమర్పించడం రాజకీయ పార్టీకి, ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.
అలాంటి శాంతియుత కార్యక్రమాన్ని అడ్డుకోవడం, నాయకులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. సాగునీటి సమస్యలను మంత్రులకు వివరించాలనే ఉద్దేశ్యంతో వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న రేగాను నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా పోలీసుల తీరు ఉందని మండిపడ్డారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు తిరుపతి ఏసోబు, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, పట్టణ యూత్ అధ్యక్షుడు సోము లక్ష్మిచైతన్యరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బానోతు శ్రీను, మండల నాయకులు కర్రి నాగేశ్వరరావు, పంగి సురేష్, సూదిపాక ఈశ్వరరావు, గుగులోత్ అశోక్ పాల్గొన్నారు.