రామవరం, ఏప్రిల్ 24 : అన్నా అంటే నేనున్నానంటూ కార్మికుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేసే రాసూరి శంకర్ మరణం తీరని లోటు అని తెలంగాణ ఉద్యమకారుడు తాళ్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం రాసూరి శంకర్ సంతాప సభ, దశదిన కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బస్తిలో గల కమ్యూనిటీ హాల్లో కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. నాడు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ ధీరుడు రాసూరి అన్నారు. ఓవైపు తెలంగాణ ఉద్యమాన్ని మరోవైపు సింగరేణి సంస్థలో వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కోసం కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సంఘం ఏర్పాటు చేసి అనునిత్యం వారి సంక్షేమం కోసం పోరాడినట్లు చెప్పారు.
అంతేకాకుండా, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీలో గతంలో సంవత్సరాల పాటు కాలయాపన చేసేవారని, నేడు వారసత్వ ఉద్యోగాల్లో త్వరతగతిన నియామక ప్రక్రియ జరుగుతుందంటే దానికి కారకుడు రాసూరి శంకర్ అని కొనియాడారు. కాంట్రాక్ట్ కార్మికుల కోసం రామవరంలో ఈఎస్ఐ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయించడంలో ఆయన కృషి మరువలేనిన్నారు, సమస్య ఏదైనా దానిని పరిష్కరించేందుకు ఎంత దూరమైనా వెళ్లేవాడని, అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు నేడు లేకపోవడం నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. నాడు కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా జెండా ఎగురవేయడంలో రాసూరి చేసిన కృషి మరువలేనిదన్నారు. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా నియమించబడి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పార్టీకి, యూనియన్‌కి తీరని లోటుగా అభివర్ణించారు.
నిత్యం కాంట్రాక్ట్ కార్మికుల మధ్య, కార్మికులతో ఉంటూ వారి సమస్యల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని.. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి రాసూరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, రైట్స్ ప్రొటెక్షన్ సోసైటీ సెక్రటరీ జనరల్ ఆర్.చంద్రశేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శివరాజ్, డాక్టర్ మహేశ్, మల్లెల రామనాధం, లగడపాటి రమేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగరు రాజశేఖర్, సంకుబాపన అనుదీప్, కాపు కృష్ణ, బండి విజయభాస్కర్, యాకుబ్, జగన్, ఆముదాల అనిల్, మునవర్, ఉమర్, ముఖేశ్, నమిళ్ల సంజీవ్, రాసుద్దీన్, అంజయ్య, సారంగపాణి, జీవీకే.మనోహర్, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ న్యూ డెమోక్రసీ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు రవి, కరుణాకర్, సాజిద్, షకీల్, సింగరేణి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.