రుద్రంపూర్, మే 07 : సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లో దుర్గంధం వెదజల్లుతున్న కాల్వ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరం కమ్యూనిటీ హాల్లో డైనింగ్ హాల్, వంటశాలలో వాడిన నీరు బయటికి వెళ్లేందుకు ఇటీవల కొత్త కాలువను నిర్మించారు. అయితే కాల్వ నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, ఎత్తుపల్లాలను సక్రమంగా సరిచూడకపోవడం వల్ల నీరు సాఫీగా వెళ్లకుండా మధ్యలోనే నిలిచిపోతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేపట్టడంతో వంటశాల నుంచి వచ్చే మురుగు నీరు డైనింగ్ హాల్ పక్కనే చేరి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. దీంతో శుభకార్యాలకు హాజరవుతున్న కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా కాల్వలో నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయమై రామవరం ఏరియా సివిల్ అధికారిని వివరణ కోరగా కాంట్రాక్టర్ కాల్వ నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. గత కొన్ని రోజులుగా కమ్యూనిటీ హాల్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్నందున మరమ్మతు పనులు చేపట్టలేకపోయామని, త్వరలోనే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.