– 37 ఏళ్ల సింగరేణి సేవా ప్రస్థానానికి ఘనమైన వీడ్కోలు
రుద్రంపూర్, ఆగస్టు 31 : కొత్తగూడెం ఏరియాలో ఏజీఎం (సివిల్)గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన చివుకుల రామకృష్ణకు సోమవారం రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో ఘన వీడ్కోలు పలికారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ గోవిందరావు మాట్లాడుతూ.. రామకృష్ణ తమ సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థకు విశేష సేవలు అందించారని అభినందించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, సింగరేణిలో రామకృష్ణ అందించిన సేవలు, వారి అనుభవం, పనిపట్ల చూపిన నిబద్ధత సహచర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, ఏజీఎం (సివిల్)గా రామకృష్ణ తన విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. సింగరేణి అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న రామకృష్ణను అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించే అవకాశం లభించడం తమ జీవితంలో ఎంతో గౌరవప్రదమైన అనుభవమన్నారు. తన ఉద్యోగ జీవితంలో అన్ని సందర్భాల్లో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ గోవిందరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జె.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వరరావు, ఏరియా ఇంజినీర్ వి.రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్.తిరుపతి, మేనేజర్ (ఐటీ) శేషశ్రీ, డీవైపీఎం హరీష్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సౌజన్యతో పాటు వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, సహచరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సింగరేణి సేవాపథంలో చెరగని సంతకం… రామకృష్ణ