జూలూరుపాడు, ఆగస్టు 07 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ గురువారం బీజేపీ మండల కమిటీ విస్తృత ప్రచారం నిర్వహించింది. మెయిన్ రోడ్లో షాపు షాపుకు తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డ అరుణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేశ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు. ఎరువులపై సబ్సిడీ, ప్రతి మనిషికి నెలకి 5 కిలోల రేషన్ బియ్యం, బీమా పథకాలు, ఉచిత గ్యాస్ పథకం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక చేయూత వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా పార్టీలకు సంబంధం లేకుండా ఇస్తున్నది. అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మాత్రమే అందజేస్తుందని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీశ్, బీజేపీ మండలాధ్యక్షుడు భూక్య రమేశ్, సిరిపురపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, నిమ్మటూరి రామారావు, బాలకిషన్, గుగులోత్ రాంబాబు, భూక్య రవి, సిరిపురపు గోపాలరావు, నరవనేని కృష్ణ పాల్గొన్నారు.