– మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో ముస్లిం మతపెద్దల సందేశం
రుద్రంపూర్, ఆగస్టు 26 : విశ్వమానవాళికి చిట్టచివరి ప్రవక్తగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త చూపిన జీవన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఆయన బోధనలు మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, న్యాయం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని తెలిపారు. రుద్రంపూర్ మండలంలోని ముస్లింలు బుధవారం మిలాద్-ఉన్-నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్, గౌతమ్ పూర్, రామవరం, ఎస్సీబీ నగర్ మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి, అనంతరం మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, ఆయన బోధనలు, ఇస్లాం ధర్మం విశిష్టతను మతపెద్దలు వివరించారు.
ప్రవక్త మహమ్మద్ తన జీవితాంతం సత్యం, న్యాయం, సమానత్వం, కరుణ, సహనం, సోదరభావాన్ని చాటిచెప్పారని తెలిపారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి మనిషిని గౌరవించడం, పేదలు, నిరుపేదలు, అణగారిన వర్గాల పట్ల దయతో వ్యవహరించడం ఆయన బోధనల సారమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనేలా ప్రతి ఒక్కరూ ప్రవక్త బోధనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం మతపెద్దలు, పెద్దలు, యువత, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘ప్రవక్త మహమ్మద్ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’