రామవరం, నవంబర్ 25 : పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలు చేయుటలో టీచర్ల పాత్ర కీలకమని, పూర్వ ప్రాథమిక విద్యలో చేరిన పిల్లలకు ఆటపాటలను పరిచయం చేస్తూ సాధ్యమైనంతగా అక్షర, గణిత జ్ఞానాన్ని అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు అయిన 24 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో నేటి నుండి ఐదు రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్నిఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు మంచి వాతావరణంలో తరగతి గదులను ఏర్పాటు చేసి, వారి ఆటపాటలకు అనువైన వస్తువులను కూడా సమకూరుస్తామని తెలిపారు. ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారు పిల్లల పట్ల తల్లి ప్రేమను చూపించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ పిల్లలే రేపటి ప్రాథమిక పాఠశాలలో చేరిన తర్వాత మంచి అభ్యసన సామర్ధ్యాలు కలిగి ఉంటారన్నారు. పూర్వ ప్రాథమిక విద్య పటిష్టంగా అందించినప్పుడు వారికి విద్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నత విద్యావంతులుగా తయారవుతారన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతులు చాలామంది పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఎన్నికవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరి జ్ఞానాన్ని పిల్లల అభివృద్ధికి ఉపయోగించి మంచి పౌరులను తయారు చేయాలని ఉద్బోధించారు. అనంతరం ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించిన వీడియోను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, రిసోర్స్ పర్సన్లు డాక్టర్ రాజశేఖర్, స్వరూప్ కుమార్, శ్రీశైలం, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ సభ్యులు నందకిషోర్, కార్తీక్, అల్లూరి పాల్గొన్నారు.

Ramavaram : పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలు చేయాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్