రుద్రంపూర్, జూలై 18 : ఇటీవల పలు మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన గర్భిణి కేసుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. సంబంధిత గర్భిణికి ప్రభుత్వ మాతా శిశు కేంద్రం (MCH)లో ప్రామాణిక వైద్య విధానాల ప్రకారం సకాలంలో చికిత్స అందించగా తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా వైద్యశాఖ వెల్లడించింది. వైద్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పద్దం భవాని (25) అనే మహిళ 40 వారాల 4 రోజుల గర్భధారణతో ఈ నెల 15న మధ్యాహ్నం 1:25 గంటలకు ఎంసీహెచ్ రామవరం ఆస్పత్రిలో ప్రసవ వేదనతో చేరింది. వైద్యుల పర్యవేక్షణలో అదే రోజు సాయంత్రం 6 గంటలకు 2.9 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు సాధారణ ప్రసవం జరిగింది. ప్రసవం పూర్తిగా సాఫీగా జరిగిందని, ప్రసవానంతర అధిక రక్తస్రావం (PPH), పెరినియల్ టియర్ వంటి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.
శిశువుకు జనన సమయంలో APGAR స్కోర్ 8/10 నమోదైందని, సాధారణ పర్యవేక్షణ కోసం SNCUలో ఉంచి పరీక్షించిన అనంతరం ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విటమిన్-K ఇంజెక్షన్, BCG టీకా, OPV జీరో డోస్ కూడా అందించినట్లు తెలిపారు. పర్యవేక్షణ అనంతరం తల్లి, శిశువు ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో నేడు డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, పోషకాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, శిశువు టీకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వేయించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
అలాగే ప్రసవం కోసం వచ్చే గర్భిణీల సౌకర్యార్థం లేబర్ రూమ్‌కు సమీపంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రత్యేక వేచి ఉండే వార్డును ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు జిల్లా వైద్యశాఖ తెలిపింది. ఈ సందర్భంగా అసంపూర్ణమైన లేదా ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రజలకు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రతి తల్లి, శిశువు ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.