రుద్రంపూర్, మే 27 : జూన్ 2న నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లవద్దని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఆసరా పెన్షన్ దరఖాస్తులు ఉన్నాయని, కేవలం రెండు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చూస్తుందన్నారు. అలాగే అర్హులైన వారందరిలో ఏ బి సి వర్గీకరణ ద్వారా కొంతమందికే పెన్షన్లు వస్తాయనే సమాచారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సైట్ ఇవ్వకుండా జూన్ 2న సామాజిక పింఛన్లు ఇవ్వడం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీ కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయని నేటికీ ఎలాంటి జీవో ఇచ్చినట్టు సమాచారం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఆన్లైన్ కేంద్రాల్లో గాని, ప్రభుత్వ మున్సిపల్, గ్రామ ఆఫీసులలో గానీ దరఖాస్తులు ఆన్లైన్ చేయమని ప్రజలు కోరుతున్నా ఆన్లైన్ సైట్ లేదని వారు సమాధానం చెప్పడాన్ని చూస్తే ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ఒకవైపు ఇంటింటి సర్వేలో అనర్హుల తొలగింపు పేరుతో కోత విధించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఈ సర్వేలో అర్హులకు అన్యాయం చేస్తే ప్రజలు సహించరని ఆమె తెలిపారు. ఆసరా పెన్షన్ దారుల లైవ్ ధ్రువీకరణ మే 15 నుండి జూన్ 15 వరకు గడువు ఇవ్వడాన్ని బట్టి చూస్తే ప్రజల్లో అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి ఆమె పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆన్లైన్ సైట్ ను ఇచ్చి జూన్ రెండు లోపు అధికారులు ఎంక్వయిరీ చేసిన దరఖాస్తులన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి అర్హులైన వారందరికీ నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేసి ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.2,000 పెంచుతామన్న మాటకు కట్టుబడి లబ్ధిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట కరుణశ్రీ, లక్ష్మి, మరమ్మ, దేవి ఉన్నారు.