కొత్తగూడెం అర్బన్, మే 02 : తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్ ప్రకటించాలని తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణబోయిన నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కూలీలైన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉద్యమకారులకు ఇండ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కావునా తెలంగాణ రాష్ట్ర సాధనకై 1969 నుండి 2014 వరకు పోరాడిన ఉద్యమకారులకు జూన్ 2న పెన్షన్ ప్రకటించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 1969లో 369 మంది విద్యార్థులు, మలి దశ ఉద్యమంలో 1,200 మంది ప్రాణాలు అర్పించినట్లు వెల్లడించారు. ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.వలి బాబా, కూచనకృష్ణారావు, దామరకొండ మల్లయ్య, కాకెళ్లి సైమన్, దేవులపల్లి రామ్మూర్తి, ఏలూరు రాములు, బొక్క శ్రీపాద సత్యనారాయణ, సత్తార్ బేగ్, అబ్దుల్ సలీం పాల్గొన్నారు.