రామవరం, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), అలాగే జూనియర్ లెక్చరర్ల (జేఎల్) వేతనాలను గతంలో మాదిరిగానే యథావిధిగా కొనసాగించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రెండు నెలల తర్వాత తాజాగా వేతనాలు విడుదల చేసిన ప్రభుత్వం, అందులో భారీ కోతలు విధించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తూ, నిరంతరం శ్రమిస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుల వేతనాల్లో కోతలు వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం జూనియర్ లెక్చరర్లకు రూ.11,600, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు రూ.13,195, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు రూ.10,460 చొప్పున కోతలు విధించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకుని, గతంలో మాదిరిగానే యథావిధిగా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు.