కొత్తగూడెం అర్బన్, మే 13 : నాల్గొవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాడే నిజమైన సంఘం తమదేనని ఆ సంఘం అధ్యక్షుడు ఎస్కే సాదిక్ పాషా, సంఘం నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను కలిసి ఉద్యోగుల సంఘం నాయకుల జాబితాను అందజేసి మాట్లాడారు. నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, తెలంగాణ నాల్గొవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్, హైదరాబాద్ అనుబంధ జిల్లా సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 11న భద్రాచలంలోని పట్టణ సంఘ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.
అధ్యక్షుడిగా ఎస్కే సాదిక్ పాషా, సహాయ అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, పి.మల్లికార్జున్‌రావు, కార్యదర్శిగా అజ్మీరా రాం రవి, సంయుక్త కార్యదర్శులుగా ఎస్.లక్ష్మణ్, జి.చంద్రశేఖర్, కోశాధికారిగా డి.జయమ్మ, ప్రచార కార్యదర్శులుగా కాంతారావు, సజ్జల వరలక్ష్మి, ఆఫీసు కార్యదర్శిగా నరేందర్ ఎన్నికైనట్లు వెల్లడించారు. సోమవారం నాల్గొవ తరగతి ఉద్యోగుల సంఘం అని ప్రకటించుకున్న సంఘంను గుర్తించవద్దని కలెక్టర్‌కు తెలిపినట్లు పేర్కొన్నారు.
రెండు రోజుల వ్యవధిలోనే రెండు సంఘాలు నియమ నిబంధనల ప్రకారం ఎన్నిక చేసుకున్నామని ప్రకటించుకున్నాయి. మరి ఎవరిది అసలైన నాల్గొవ తరగతి ఉద్యోగుల సంఘమో తేల్చుకోలేని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు.