– ధన్‌బాద్ పంచాయతీ కఠిన నిర్ణయం
రుద్రంపూర్, ఏప్రిల్ 16 : ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బ్లాస్టింగ్‌కు అవసరమైన అభ్యంతరం లేని ధృవపత్రం (NOC) ఇవ్వబోమని చుంచుపల్లి మండలం ధన్‌బాద్ పంచాయతీ సర్పంచ్ గుగులోతు జ్యోతి స్పష్టం చేశారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. సింగరేణి గనుల కార్యకలాపాల వల్ల గ్రామంలో దుమ్ము తీవ్రంగా వ్యాపిస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక వసతులు కూడా యాజమాన్యం కల్పించడం లేదని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో కొత్త CHP సైడింగ్, రహదారి, ఎంబాంక్‌మెంట్ పనులు VKCM ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా కొనసాగుతున్నాయి. భూమి తవ్వకాల సమయంలో గట్టి రాళ్లు ఎదురవడంతో బ్లాస్టింగ్ అవసరం ఏర్పడింది. దీనికి అనుమతుల కోసం సింగరేణి అధికారులు జిల్లా పరిపాలనను సంప్రదించగా, అధికారులు స్థల పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ సభలో గ్రామస్తులు పలు సమస్యలను ప్రస్తావించారు. తాగునీటి కోసం కనీసం రెండు కుళాయిలు కూడా ఏర్పాటు చేయలేదని, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇతర పంచాయతీలకు ఇచ్చి తమను విస్మరించారని ఆరోపించారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, ప్రభావితం కాని ప్రాంతాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. బ్లాస్టింగ్ కారణంగా గాలి కాలుష్యం పెరిగి దుమ్ము తీవ్రంగా వ్యాపిస్తోందని, పేలుళ్ల వల్ల ఇళ్లలో చీలికలు వస్తున్నాయని, కంపనాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్లు 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఎగిరి పడుతున్నాయని, ఇది ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదమని హెచ్చరించారు. భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, DGMS నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని, బఫర్ జోన్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, గాలి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

‘సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బ్లాస్టింగ్‌కు నో ఎన్ఓసీ’
గతంలో పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పని చేయించుకున్నారు కాగితాలను పక్కకు పెట్టారు, ఇదేనా మాట మీద నిలబడే మీ తత్వం, ఇదేనా ప్రభావిత ప్రాంత ప్రజల పైన మీకు ఉన్న శ్రద్ధ, CSR కింద స్థానిక యువతకు ఉద్యోగాలు, విద్యా, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా వీ కే కోల్ మైన్ విస్తరణలో భాగంగా మాయాబజార్ ప్రాంతంలో నిర్వాసితులైన 15 మందికి ఇంటి స్థలాలు కేటాయించాలని, ఇంటి స్థలాలు కేటాయించిన స్థలాలలో మంచినీటి వసతులు కల్పించాలని, మా ప్రాంతంలోనే పనులు జరుగుతున్నాయి తమ పిల్లలు ఆడుకోవడానికి నాలుగు లారీల మట్టి అడిగితే ఇవ్వలేదని. ఇదే రైల్వే స్లైడింగ్ తీసుకున్న మట్టి పాల్వంచ వరకు ఎట్లా వెళ్లింది అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు NOC ఇవ్వబోమని సర్పంచ్, పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా వికే కోల్ మైన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం. నరసింహారావు మాట్లాడుతూ.. గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ సభలో ఉప సర్పంచ్ ప్రేమ్ సెక్రెటరీ ఉపేందర్, రుద్రంపూర్ కార్యదర్శి నరేందర్, వార్డు మెంబర్లు లత, కర్రి అపర్ణ, ఒరుసు నర్సి, ఏరియా సివిల్ ఏజీఎం రామకృష్ణ, స్టేట్ అధికారి తౌర్య, సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్, ఈఈ సుమంత్, శ్రీనివాస్, జమేదార్ కామరాజు, మాజీ సర్పంచ్ బానోత్ రాందాస్, మాజీ ఎంపీపీ సలిగంటి శ్రీనివాస్, భూక్యా శ్రీదేవి, పెచ్చెట్టి శివ,పూల రవీందర్, కీర్తి రవీందర్, ఇస్లవత్ రంజిత్, కర్రి శేఖర్, జక్కెనవేణి నరేష్, అనిల్, పిల్లి సుజాత నాగరాజు, డేవిడ్, కార్తీక్, గ్రామస్తులు పాల్గొన్నారు.