రామవరం, మే 17 : జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు, ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈసారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నత స్థానంలోకి తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చేయాలని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలిపారు. మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసులలో కక్షిదారులకు న్యాయం జరగాలని సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో రాజీపడటం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు వృథా అవ్వవని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, మనోవర్తి, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ కేసులు, టెలిఫోన్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించుకొనుటకు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, పీపీ పీవీడీ లక్ష్మి, ఏపీపీలు, పోలీస్ అధికారులు, సీనియర్ న్యాయవాదులు ఎస్వీ రామారావు, బాగం మాధవరావు, గాదే రామచంద్ర రెడ్డి, అంబటి రమేశ్, మధుకర్ పాల్గొన్నారు.