– గతేడాది కంటే రూ.2.11 లక్షలు ఆదాయం అదనం
బూర్గంపహాడ్, ఏప్రిల్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ పంచాయతీలో వారాంతపు సంత వేలంపాటను భద్రాచలానికి చెందిన చేతన మీ సేవా నిర్వాహకుడు, పాటదారుడు భూక్యా రంజిత్ నాయక్ బుధవారం రూ.35.61 లక్షలకు కైవసం చేసుకున్నాడు. ఎంపీడీఓ కుడుముల జమలారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ బొర్రా సుభద్ర, ఉప సర్పంచ్ పొక్కుల రవి సమక్షంలో మోరంపల్లిబంజర్, సారపాక, పినపాక పట్టీనగర్ కార్యదర్శులు భవానీ, కంది మహేశ్, విజయ్ నిర్వహించారు. గత ఏడాది రూ.33.50 లక్షలకు కూరగాయలు, పశువుల సంతను దక్కించుకోగా ఈ ఏడాది అదనంగా రూ.2.11 లక్షలు పంచాయతీకి ఆదాయం రావడంతో ప్రజా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. పాటదారుల నుండి పోటీ పెరగడంతో ఏకంగా రూ.35.61 లక్షలకు భూక్యా రంజిత్ నాయక్ సంత వేలాన్ని దక్కించుకోవడంతో సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు పాటదారుడిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాటదారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.