రామవరం, మార్చి 25 : ఈ ఏడాది చివరలో జరిగే బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లను దండుకోవాలనే కుటిల లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ”సౌగాత్ ఏ మోదీ” పేరుతో 32 లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాలను అందించే పథకానికి శ్రీకారం చుట్టారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం నాడు ఒక ప్రకటనలో దుయ్యపట్టారు. గత పదేండ్లలో మోదీ ప్రభుత్వానికి రంజాన్ పండుగ కానరాలేదా అని ప్రశ్నించారు.
ముస్లింలను విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా తొక్కిపెట్టడానికి 2022 నుంచి ప్రీ -మెట్రిక్, పోస్ట్ – మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ ఉపకార వేతనాలను రద్దు చేసి పేద ముస్లింల నోటిలోని కూటిని లాక్కొన్నారని దుయ్యబట్టారు. దీంతో పాటు అబుల్ కలాం ఫెలోషిప్ ను కూడా రద్దు చేశారన్నారు.
అదేవిధంగా వక్ఫ్ సవరణ బిల్లుకు శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించిన మోదీ, అమిత్ షాకు నేడు ముస్లింలు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల కన్నా ముస్లింల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయని జాతీయ స్థాయిలో పలు కమిషన్లు తమ నివేదికల్లో పేర్కొన్నపటికి, వాటన్నింటినీ పెడచెవిన పెట్టి ముస్లింలను అణగదొక్కే ఆలోచనలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. నిజంగా ముస్లింల పట్ల ప్రేమ ఉన్నట్లయితే విద్యా, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు తగు ప్రాతినిధ్యం కల్పించే విధంగా చట్టాలు అమలు చేయాలని, రంజాన్ తోఫాలతో ముస్లింల స్థితిగతులు మారవన్నారు.