రామవరం, జూన్ 19 : సారా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గోల్కొండ లక్ష్మి (89) మరణం తీరని లోటు అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నివసించే గోల్కొండ లక్ష్మి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే కూనంనేని రుద్రంపూర్‌లోని ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు,
లక్ష్మి సిపిఐ పార్టీలో క్రియాశీలకంగా ఉండడమే కాకుండా, మహిళా సమాఖ్య సభ్యురాలుగా మహిళా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిందని తెలిపారు. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటమే ఆమె అజెండాగా పనిచేశారని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ పార్టీ నాయకులు సాబీర్ పాషా, గనిగళ్ల వీరస్వామి, వంగ వెంకట్, రమణమూర్తి, కొవ్వూరి రాజేశ్వరరావు, సందిరి గోపాల్, మైలా రాజేశ్వరరావు, ముంతాజ్, లక్ష్మి ఉన్నారు.