రామవరం, జూన్ 16 : ప్రమాదశాత్తు రైలు నుంచి జారిపడడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన రఘునాథపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి పుల్లూరి సుభాష్ (49) బొగ్గు లోడింగ్ అన్ లోడింగ్ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా లోడింగ్ అన్లోడింగ్ పనులు నిలిచిపోవడంతో గత్యంతరం లేక సోలార్ కంపెనీలో వాచ్‌మెన్‌గా పనికి కుదిరాడు. అక్కడ కూడా చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నాడు. సుభాష్ కుమార్తె ఇంజినీరింగ్ చదువుతుంది. కూతురు చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఉండే మిత్రుడిని తాను పని చేసే స్థలంలోనే తనకు కూడా పని చూడాల్సిందిగా కోరాడు.
దాంతో ఆ స్నేహితుడు అధికారులతో మాట్లాడేందుకు సుభాష్‌ను హైదరాబాద్‌కు పిలిపించాడు. ఉద్యోగం ఓకే అయింది. హైదరాబాద్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రఘునాథపల్లి వద్ద పడిపోవడంతో మృతి చెందినట్లు రైల్వే పోలీస్ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. సుభాష్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.