రామవరం, జులై 02 : ఈ నెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెతో కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియా జీకే ఓసీలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకించారు.
కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రను ఖండించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ ఏఐటీయూసీ నాయకులు వట్టికొండ మల్లికార్జున్, ఐఎన్టీయూసీ మొహమ్మద్ రజాక్, సీఐటీయూ విజయగిరి శ్రీనివాస్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితపు విజయ్ కుమార్, ఫిట్ సెక్రెటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.