కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 30 : సమస్త సంపాదన సృష్టించే శ్రామిక వర్గాలను కులాల వారీగా విభజించి కులాలను కాపాడుతున్న సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని కుల వివక్షతను ఎండగడుతూ నూతన సమాజాన్ని నిర్మించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సత్యశోధకు సమాజ్ 153వ ఆవిర్భావ సందర్భంగా మంగళవారం రైటర్ బస్తీలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని, అంటరానితనాన్ని, కుల వివక్షతను ఆనాడే జ్యోతిరావు పూలే 1873లో గ్రహించి సావిత్రిబాయి పూలే తోటి అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక గ్రామాలు, వాడలలో ప్రచారం నిర్వహించి విద్యాలయాలు స్థాపించి కుల నిర్మూలన అవగాహనను పెంపొందించారన్నారు. ఎన్నో అవమానాలకు గురిచేసినా ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారిద్దరు అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు.
ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హిందూ బావజాలాన్ని ఆనాడే జ్యోతిరావు పూలే గ్రహించారని నేడు బిజెపి ప్రభుత్వం విభజించు పాలించు అనే సూత్రంతోటి కులాలను విభజిస్తూ కొట్లాటలు పెట్టిస్తూ తన పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా, ఆధునిక యుగంలోకి అడుగుపెట్టినా, గుండె తీసి గుండె మార్పిడి చేస్తూ ఆకాశంలో వ్యవసాయాన్ని పండించాలని మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొని అభివృద్ధి చెందుతున్నమని చెబుతున్న పాలకులు నేడు ఇంకా రెండు గ్లాసుల పద్ధతి, రెండు ప్లేట్ల పద్ధతి కొనసాగిస్తున్నారని విమర్శించారు. పర్మినెంట్ ఉద్యోగాలను తగ్గిస్తూ, విద్యాలయాలను తగ్గిస్తూ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా మహిళలపై జరుగుతున్న దాడులు, ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడాన్ని, కార్మికుల హక్కులను కాలరాస్తూ, శ్రమ దోపిడి చేస్తూ, నూతన చట్టాలని తీసుకొస్తూ వీటికి వ్యతిరేకంగా ప్రశ్నించే వారిని, వారి కోసం పోరాడే వారిని బూటకపు ఎన్కౌంటర్లు, అక్రమ కేసులు, జైల్లో నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు.
భారతదేశం కుల వ్యవస్థలో కూరుకుపోయిందని, చదువుకున్న యువకులు, మేధావులు, ప్రజలు, కార్మికులు, కర్షకులందరూ కూడా కుల వివక్షతను విడనాడి కుల వ్యవస్థను నిర్మూలిస్తూ నూతన సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్కే ఉమర్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సీతారామయ్య, ఏరియా కార్యదర్శి ఎన్.సంజీవ్, జిల్లా నాయకులు మల్లికార్జున్ రావు, మారుతి రాఘవ, సంధ్య, లక్ష్మి, నరసింహ, రామకృష్ణ, కృష్ణ, కొండల్ రావు పాల్గొన్నారు.