కొత్తగూడెం అర్బన్, జూన్ 28 : విప్లవోద్యమ నేత, శ్రామికవర్గ యోధుడు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలో పార్టీ కార్యాలయంలో డి.వి. కృష్ణ మూడో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించి మాట్లాడారు. కృష్ణ మార్క్సిస్టు-లెనినిస్టు సైద్ధాంతిక, రాజకీయ దృక్పథం, విధానం నిండుగా కలిగినవాడని, నిర్మాణ దక్షుడని, అత్యంత ఆదర్శవంతమైన ఆచరణ గలవాడని కొనియాడారు. లేబర్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఉద్యోగం వదిలి 1969-70ల నుంచి విప్లవ బాటలో సుదీర్ఘంగా 52 ఏండ్లకు పైగా ధృఢంగా నిలబడి నడిచిన ఆయన ఉద్యమ స్ఫూర్తి అందరికి ఆదర్శమని తెలిపారు.
1980ల నుంచే విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలోని ఆచరణకు సాధ్యంకాని విషయాలనూ, రాజకీయ, సైద్ధాంతిక లోపాలనూ ఎత్తిచూపుతూ ఎంతో దృఢంగా పోరాడిన నాయకుడన్నారు. ఒక్క సైద్ధాంతిక వేత్తగానే కాకుండా, నిజామాబాద్ జిల్లాలో కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించాడని, బీడీ కార్మికోద్యమాన్ని, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించినట్లు చెప్పారు. సిరిసిల్లా ఉద్యమానికి పునాదిగా నిలిచిన నిమ్మపల్లి పోరాటాలు నిర్మించినవాడని, ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అన్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతూ సోషలిస్ట్ సమాజ స్వప్నాలతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జాటోత్ కృష్ణ ,అమరలపూడి రాము, రూపిరెడ్డి మధుసూధన్‌రెడ్డి, జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, బానోత్ ధర్మ, డివిజన్ నాయకులు ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు.