ఇల్లెందు, ఆగస్టు 21 : వయో వృద్ధులకు చట్టాలు అండగా ఉంటాయని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. గురువారం ఇల్లెందులో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గోవింద్ సెంటర్ నందుగల పెన్షన్ భవన్లో ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వయో వృద్ధులైన తల్లిదండ్రులకు వారి కొడుకులు, కూతుర్లు సంరక్షణ అందించక పోవడం వల్ల వారు నిరాధారణకు గురవుతున్నట్లు తెలిపారు. ఆస్తులు పంచుకుంటున్నారే గాని వారికి ప్రేమను, సంరక్షణను అందించలేక పోతున్నారన్నారు.
నిరాధారణకు గురైన వయో వృద్ధులకు చట్టాలు రూపొందించబడినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నట్లయితే విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని, అంతేకాకుండా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గాని మండల న్యాయ సేవాధికార సంస్థను గాని ఆశ్రయించినట్లయితే ఎటువంటి రుసుం లేకుండా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు, సెక్షన్ 144 భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ ద్వారా మనోవర్తి సైతం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి ఉమామహేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు దాసరి స్వామి దాసు పాల్గొన్నారు.