చండ్రుగొండ, మార్చి 26: ఒకవైపు గిట్టుబాటు ధర లేక, మరోవైపు కాయ కోతకు కూలి ధర అధికంగా ఉండడంతో మిర్చి రైతులు కుదేలౌతున్నారు. పత్తి, వరిలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడాది రైతులు మిరప సాగు విస్తీర్ణం పెంచారు. పలువురు రైతులు ఎకరానికి రూ.30 వేలు కౌలుకు తీసుకుని సాగు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మార్కెట్లో మిరపకాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. చండ్రుగొండ మండలంలో 5 వేల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు. ప్రస్తుతం మిరపకాయలు కోత దశలో ఉన్నాయి.
మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వలస కూలీలు వచ్చినా ఇక్కడ కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. కాయలను బట్టి కేజీ రూ.20 నుండి రూ.30 వరకు కోసినందుకు రైతులు కూలీలకు చెల్లించాల్సి వస్తుంది. మిర్చి ధర తక్కువ ఉండడం, కూలీల రేట్లు ఎక్కువ ఉండడంతో కనీసం గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు కూలి ధర చూసి కాయలు కోయించకుండా పశువులను మేపుతున్నారు. మిరపకు క్వింటా ధర రూ.25 వేలు కల్పిస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు అంటున్నారు.
Chilli Crop : మిరప కోతకు కూలీల డిమాండ్