చండ్రుగొండ, ఫిబ్రవరి 21: మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు పెద్దిని వేణు మాట్లాడుతూ.. 2017 నుంచి తామర వైరస్ మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని చెప్పారు. దీనిద్వారా దిగుబడి తక్కువగా వస్తున్నదని, ఖర్చు ఎక్కువ అవుతుందని వెల్లడించారు.
పంటను అమ్మితే వచ్చిన డబ్బులు ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ ఖర్చులకే సరిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే రాయితీ రూపంలో మిర్చి పంటను కొనుగోలు చేయాలన్నారు. మిర్చి మార్క్ఫెడ్ కంపెనీని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేనట్లయితే రైతాంగమంతా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిర్చి పంటకు మద్దతు ధర కల్పించకపోతే రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఐక్యం చేసి రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పెద్ద వెంకటేశ్వర్లు, రాజా, రైతులు శ్రీను, లక్ష్మణ్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.