కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 10 : న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో పనిచేసి, పేదలకు చేసిన సేవకు యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ గడిదేశి కాంతయ్యకు గౌరవ డాక్టరేట్ అందించడం గొప్ప విషయమని తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణబోయిన నర్సయ్య అన్నారు. బుధవారం కొత్తగూడెం పట్టణంలోని బీసీ సంఘం కార్యాలయంలో డాక్టరేట్ పొందిన కాంతయ్యను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో నిజాయితీగా 25 సంవత్సరాల పాటు న్యాయవాది వృత్తిలో నిబద్ధతతో పని చేస్తూ, ఎందరికో పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం అందించే ప్రయత్నంలో ప్రత్యర్థి వారు పెట్టే ప్రలోభాలకు సైతం లొంగక తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి న్యాయాన్ని గెలిపిస్తున్న న్యాయవాది కాంతయ్య సేవలు ఎనలేనివని కొనియాడారు.
ఆయన సేవలను గుర్తించి అమెరికా గ్లోబల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేయడం జిల్లా న్యాయ వ్యవస్థకు గర్వకారణం అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిస్తే సమాజానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కాకెళ్లి సైమన్, ఖమ్మం లింగయ్య, శ్రీపాద సత్యనారాయణ, మిట్టపల్లి సాంబయ్య, సత్తార్ బేగ్, సలీం, కుడిక్యాల సమ్మయ్య, రామాచారి, బీసీ జిల్లా నాయకుడు అంకినీడు ప్రసాద్ పాల్గొన్నారు.