– ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి
– పీపీఏ బృందాన్ని వేర్వేరుగా కలిసి చర్చించిన ఎమ్మెల్యేలు
బూర్గంపహాడ్, జూన్ 04 : పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు అన్నారు. ఈ మేరు గురువారం వేర్వేరుగా పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం)ను కలిసి చర్చించారు. తొలుత పాయం పీపీఏ సీఈఓ సంజీవ్ నందన్ సహార్ను కలిసి పోలవరం బ్యాక్ వాటర్ వల్ల పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం, బూర్గంపహాడ్ ప్రాంతాల్లో ముంపు పరిస్థితులను వివరించి వారికి న్యాయం చేయాలని కోరారు. గ్రామాల్లో వ్యవసాయ భూములు, ప్రజల జీవనోపాధి, మౌలిక సదుపాయాలకు ఏర్పడుతున్న ముప్పుపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాలతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం తదితర గ్రామాలు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని అధికారిక అంచనాల కంటే వాస్తవ పరిస్థితుల్లో మరింత విస్తీర్ణంలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వందల కుటుంబాలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ భద్రతకు కూడా భవిష్యత్లో వరదముప్పు వాటిల్లే అవకాశం ఉందని పీపీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభావిత ప్రాంతాల్లో సమగ్ర శాస్త్రీయ బ్యాక్ వాటర్ సర్వే నిర్వహించి పునరావాస, పునఃనిర్మాణ ప్యాకేజీ ప్రకటన చేయడం, భూములు కోల్పోయే రైతులకు న్యాయపరమైన పరిహారం, ఉపనదులపై బ్యాక్ వాటర్ ప్రభావ అధ్యయనం చేపట్టడం, శాశ్వత వరద నియంత్రణ చర్యలు అమలుచేయడం, రక్షణ కరకట్టలు, ప్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించడం వంటి డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు.

‘పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు న్యాయం చేయాలి’
అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీపీఏ సీఈవోను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాల సర్వేకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలంలో ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని.. సర్వేను పారదర్శకంగా నిర్వహించి ముంపు ప్రాంతాల్లో ఏ మేరకు ప్రభావం ఉంటుంది… ఎలాంటి చర్యలు చేపట్టాలో కేంద్రానికి నివేదిక ద్వారా వివరించాలని కోరారు. ముంపు ప్రాంతాల బాధితులకు మెరుగైన పరిహారం, ప్యాకేజీ ఇవ్వడంతో పాటు శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం ఉపసర్పంచ్ పోతిరెడ్ది వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ కిషోర్నాయక్, ఐఎన్టీయూసీ నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి, వేజ్బార్డు మెంబర్ యారం పిచ్చిరెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి, భజన ప్రసాద్, ఎడమకంటి సుధాకర్ రెడ్డి, వారాల వేణు, ఇంగువ రమేష్, చంటి, ఐఎన్టీయూసీ యూత్ జిల్లా అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం నాయకులు భీమవరపు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం అధికారులను సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. పోలవరం ఎత్తు పెంపుతో బూర్గంపహాడ్ గ్రామానికి పొంచి ఉన్న ముప్పుపై పోలవరం అథారిటీ అధికారులకు వివరించారు. దీనికి స్పందించిన అధికారులు ముంపునకు గురయ్యే గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహిస్తామని… సర్వే ద్వారా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి కేంద్రానికి నివేదిక సమర్పించడంతో పాటు ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలపై కూడా నివేదికలో పొందుపర్చనున్నట్లు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో వార్డుసభ్యులు భజన పెదనాగం, తోకల శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు లక్కోజి విష్ణువర్ధన్, కేవీ.రమణ, కైపు శ్రీనివాసరెడ్డి, గుద్దేటి ప్రవీణ్, వీవీబీ. చారి, అశిక్, దన్సీరామ్, పున్నంచంద్, హరినాథ్, గూడూరు వెంకన్న, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మున్నా ఉన్నారు.

‘పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు న్యాయం చేయాలి’