– ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ డిమాండ్
– జూన్ 2న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా
జూలూరుపాడు, మే 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ జిల్లాలో ఉన్న సింగరేణి సంస్థలో నిబంధనల ప్రకారం గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ రాజేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో గురువారం నిర్వహించిన ముందస్తు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం జూన్ 2న నిర్వహించ తలపెట్టిన ‘ఛలో కొత్తగూడెం’ మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు, గిరిజన యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
జిల్లాలో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైన్స్ వస్తే తమ నిరుద్యోగ సమస్యలు తీరుతాయని, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించిన గిరిజన యువతకు తీవ్ర నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చట్టాలను తుంగలో తొక్కి, కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చి నియమించుకుంటున్నారని మండిపడ్డారు. దీనివల్ల స్థానిక గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ఇతర రాష్ట్రాల కార్మికులను తొలగించి స్థానికులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1997 సమతా జడ్జిమెంట్, 1996 పెసా యాక్ట్ ప్రకారం గిరిజనులకు ఉద్యోగాలలో, కాంట్రాక్ట్ పనులలో 100 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ (1/70 చట్టం), పెసా చట్టం ప్రకారం గిరిజనేతర సెక్యూరిటీ ఏజెన్సీల లైసెన్సులు చెల్లవని, ప్రస్తుతం ఉన్న ఏజెన్సీల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, ఆ కాంట్రాక్టులను గిరిజనులకే కేటాయించాలని స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థకు లభిస్తున్న మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 43 శాతం కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ఏరియా గనుల నుంచే లభిస్తోందని రాజేష్ నాయక్ గుర్తు చేశారు. కాబట్టి కార్పొరేట్ సామాజిక బాధ్యత పాలసీ కింద సంస్థకు వచ్చే లాభాల వాటా నుండి 43 శాతాన్ని నేరుగా గిరిజన గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. జూన్ 2న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయడం ద్వారానే గిరిజన హక్కులను కాపాడుకోగలమని వారు ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశల్ నాయక్, వైరా ఇన్చార్జి నాగేశ్వరావు నాయక్, గిరిజన నాయకులు భూక్య రాములు, అంగోత్ బిచ్చు, లకావత్ వినయ్, బోడ బోడి, భానోత్ నరేష్, సురేష్, కోటియా పాల్గొన్నారు.