రుద్రంపూర్, మే 26: కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో మణుగూరు దుర్గా కంపెనీ ఉద్యోగ నియామకాలలో అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా గతంలో సమర్పించిన మెమోరాండంపై మంగళవారం ఎల్ఈఓ నాగశేఖర్ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కార్మికులను పిలిపించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాష బోయిన రవికుమార్ మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా అదే పనిలో కొనసాగుతున్న స్థానిక కార్మికులను పక్కన పెట్టి, నాన్-లోకల్ వ్యక్తులను ఎక్కువగా ఉద్యోగాల్లో నియమించడం దురదృష్టకరమని తెలిపారు.
దీని వల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎల్ఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎల్ఈఓ నాగశేఖర్ వెంటనే స్పందించి, మణుగూరు ఓసీ-4 పీఓ రమేష్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన పీఓ రమేష్ రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించి, బాధిత స్థానిక కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రాంతానికి చెందిన అప్పారావు, సురబాబు, సీహెచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.