కారేపల్లి, ఏప్రిల్ 29 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఉసిరికాయలపల్లిలో పలువురు పేదలు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామ సభ పెట్టిన ఎంపిక చేసిన వారికి రాకుండా అనర్హులకు ఇండ్లు మంజూరు కావడంపై వారు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బానోతు బన్సీలాల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యుడు దాసరి మల్లయ్య మాట్లాడుతూ.. గ్రామ సభలో ఏకగ్రీవంగా 40 మంది నిరుపేదలను ఎంపిక చేసి అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు.
ఆ జాబితాను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల కమిటీ అయిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు పేదలు, ఇండ్లు లేనివారిని పక్కన పెట్టి తమ కార్యకర్తలు, గ్రామంలో లేని పలుకుబడి కలిగిన వారికి ఇండ్లు మంజూరు చేసినట్లు దుయ్యబట్టారు. నిజమైన పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అధికారులు వెంటనే రీ సర్వే చేసి అర్హులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యదర్శి నిరంజన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ లాకావత్ చంద్రశేఖర్, బీ.బాలు, దాసరి సైదులు, ఎం.బాలుచౌహన్, లలితమ్మ, రవికుమార్, వాంకుడోత్ చిన్నా, రాములు, వినోజ్ కుమార్, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.