రామవరం, జనవరి 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్టీ ఏరియాలో ఆకతాయిల చేష్టలు రోజురోజుకు మితిమిరిపోతున్నాయి. మత్తు పదార్థాలకు బానిసైన ఆకతాయిలు కొబ్బరి చెట్లకు ఉన్న బొండాలను కోయడం కష్టమవుతుండడంతో ఏకంగా చెట్లనే నరికి అమ్మి, ఆ డబ్బుతో మద్యం–గంజాయి కొనే స్థాయికి తెగబడ్డారు. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ఇక్కడి ప్రజలను సింగరేణి ఖాళీ చేయించిన తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. స్థలం మాత్రం తీసుకున్నారు కానీ భద్రతా చర్యలు తీసుకోవడంలో సింగరేణి అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ప్రజలు మండిపడుతున్నారు.
ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో ఈ ప్రాంతం మద్యం, గంజాయి, వ్యభిచార కేంద్రంగా మారిపోయిందని అంతా చర్చించుకుంటున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటాలని పిలుపునిస్తే మరోవైపు ఇక్కడ ఇప్పటికే పెరిగిన చెట్లకే రక్షణ లేకుండా పోవడం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది. ఇప్పటికైనా పోలీసులు, సింగరేణి అధికారులు జోక్యం చేసుకుని చెట్లు నరుకుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.