– సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్ హెచ్చరిక
బూర్గంపహాడ్, ఆగస్టు 29 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాక మేజర్ పంచాయతీలో రోడ్లపై, హెచ్చరిక బోర్డుల వద్ద ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే జరిమానా తప్పదని సర్పంచ్ గుగులోత్ కిశోర్ నాయక్ హెచ్చరించారు. శనివారం పంచాయతీలో పర్యటించిన ఆయన హెచ్చరిక బోర్డులు ఉన్న చోట చెత్తను వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను మనమే శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. పరిశుభ్రత లేకుండా ఇలా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేస్తే ప్రజల ఆరోగ్యాల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు.
మేజర్ పంచాయతీలో ప్రజలు ఇళ్లలో చెత్తను ఒక డబ్బాలో పెట్టి పంచాయతీ వాహనం వచ్చినప్పుడు అందులో మాత్రమే వేయాలని, రోడ్లపై, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో చెత్తను పారబోస్తే సహించేదిలేదని, అలాంటి వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. ఆయన వెంట దామెర ఆదినారాయణ, ఎల్లంకి రాము, ఓబుల్‌రెడ్డి, కృష్ణ ఉన్నారు.