బూర్గంపహాడ్, జూన్ 16 : ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు జక్కుల రాంబాబు డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి బిల్లులు రాకుండా ఆపడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురిచేయడం తగదన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సొంతింటి కలను నెరవేర్చుకునే క్రమంలో సకాలంలో వారికి బిల్లులు మంజూరు చేయకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు తక్షణమే బిల్లులు చెల్లించే ప్రభుత్వం పేదవాడు సొంతి ఇల్లు నిర్మించుకుంటే సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటోనని మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేసి నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.