రామవరం, మే 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐటీసీ (ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్) వారి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ రూ.2 కోట్ల నిధులతో నూతన హాస్టల్ నిర్మాణంతో పాటు కళాశాల ముఖద్వారం నుండి కళాశాల లోపల వరకు సుమారు 400 మీటర్ల పొడవుతో సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. గుత్తేదారుడు రోడ్డుకు ఇరువైపులా పోయవలసిన సైడ్ బారామ్స్ ఉపయోగించవలసిన మట్టిని బయట నుండి తీసుకు రావాలి. కాగా అనుమతులు లేకుండా కళాశాల ఆవరణలో సెలవు దినాన్ని చూసుకుని 24 మీటర్ల లోతు గోతిని తవ్వి రోడ్డుకి ఇరువైపులా మట్టిని పోశాడు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది.
వర్షాకాలంలో ఎవరైనా విద్యార్థులు ఆదమరిచి అటువైపు వెళ్లి అందులో పడిపోతే ప్రాణపాయం తప్పదు అంటున్నారు లెక్చరర్స్. తను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోనేందుకు ఇంకుడుగుంత అనే పేరు పెట్టి బుకాయిస్తు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలలో ఎకరానికి ఐదు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. దీనికి ఎటు చూసినా మీటర్ పొడవు వెడల్పు లోతు ఉండేలా మార్గదర్శకాలు జారీ చేశారు.
మరి ఇంత లోతు ఎందుకు తవ్వినట్లు. సైడ్ బారామ్స్ వాడే మట్టికి బిల్లు తీసుకోడా? భవిష్యత్లో ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? జరగవద్దంటే కాంట్రాక్టర్ తీసిన గోతిని వెంటనే పూడ్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టిన సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై డిఈ నాగేశ్వర చారిని నమస్తే తెలంగాణ వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆది ఇంకుడుగుంత కాకుండా వేరే విధంగా ఉంటే కాంట్రాక్ట్ తో ఆ గోతిని పూడిపిస్తామని తెలిపారు.
Ramavaram : మట్టిని తోడేశాడు.. ఇంకుడుగుంత అంటున్నాడు