రామవరం ఏప్రిల్ 19 : కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే ఓసీని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా గతంలో జీకే ఓసిలో పనిచేసిన సింగరేణి ఉద్యోగులతో, సింగరేణి మిషనరీతో నడిపిన విధంగానే వీకే ఓసీని కూడా సింగరేణి ఉద్యోగులతో నడిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కుసానా వీరభద్రం, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య అన్నారు. ఈ మేరకు శనివారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు వినతిపత్రం అందించారు. ఏరియా జీఎం ద్వారా తమ అభ్యర్థనను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు తెలుపాలని కోరారు.
ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన మాట మేరకు జీకే ఓసీలో పనిచేసిన అన్ని డిజిగ్నేషన్ల వారిని వీకే ఓసికి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. చాలా సంవత్సరాల నుండి సర్ఫేస్ జనరల్ మజ్దూర్ ఖాళీలు భర్తీ చేయడం లేదని, డిప్యూటేషన్ మీదనే వాడుకోవడం జరుగుతుందన్నారు. సర్ఫేస్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో నిర్ధారించి సీనియారిటి ప్రకారం భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాగితపు విజయ్ కుమార్, మాదాసు ఈశ్వర్, బ్రాంచ్ సెక్రటరీలు అశోక్, లక్ష్మీనారాయణ, రమేశ్, వీరయ్య, రామ్మూర్తి, బాబురావు, సర్వర్, రాజు పాల్గొన్నారు.