కొత్తగూడెం అర్బన్, జూన్ 12 : బడి ఈడు బాలలందరూ బడిలోనే ఉండాలని, బాల కార్మికులుగా ఎవరూ మిగిలిపోకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఆయన గురువారం తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున బడి ఈడు పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలని, ఎవరు కూడా పని ప్రదేశంలో ఉండవద్దని, బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘బడిబాట’ కార్యక్రమం ప్రారంభమైనందున ప్రజలు, తల్లిదండ్రులు, అధికారులు అందరూ కలిసి నూరు శాతం పాఠశాలలో నమోదు జరిగే విధంగా కృషిచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలలు ఎక్కడెక్కడ పని ప్రదేశాలలో ఉన్నారో గుర్తించాలని, జిల్లాలోని బడిఈడు బాలలందరూ తప్పనిసరిగా పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎండి. షార్పోద్దీన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరి కుమారి, డీసీపీయూ యూనిట్ బాధ్యులు అజీజ్, నాగరాజు, ఎయిడ్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ వి.రాజేశ్ పాల్గొన్నారు.